రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా..నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థలపై చర్యలు

రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా..నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థలపై చర్యలు
  • కొనుగోలుదారులకు వడ్డీతో సహా రీఫండ్ చేయాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించిన 8 రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చర్యలు తీసుకుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, హామీలు నెరవేర్చకపోవడం, నమోదు లేకుండా బుకింగ్‌‌‌‌లు చేపట్టడం వంటి కారణాలపై కొనుగోలుదారులకు వడ్డీతో సహా సొమ్ము వాపసు చేయాలని ఆదేశించింది.

రెరా చేపట్టిన చర్యలివీ..

సనాలి ఐటీ పార్క్స్ సంస్థ రెరా చట్టం 2016లోని సెక్షన్లు 3, 4 ఉల్లంఘించినందుకు రూ.25 లక్షల జరిమానా విధించింది. 30 రోజుల్లో చెల్లించాలని, మంచిరేవులలోని 'సనాలి ది ఎడ్జ్' ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు, బుకింగ్‌‌‌‌లు, విక్రయాలు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది.    
శ్రీ ఆదిత్య స్క్వేర్స్ సంస్థ నిర్మాణంలో జాప్యం చేసి, బుకింగ్ రద్దు చేసుకున్న కొనుగోలుదారుకు నగదు వాపసు ఇవ్వకపోవడంతో రూ.17 లక్షలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.
త్రిపుర కన్‌‌‌‌స్ట్రక్షన్స్ డబ్బులు వసూలు చేసి  నిర్మాణం ప్రారంభించకపోవడం, ఫ్లాట్ అప్పగించకపోవడంతో రూ.41.85 లక్షలు వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.
వాసవి రియల్టర్స్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ ఒప్పందం ప్రకారం ఫ్లాట్ అప్పగించకపోవడంతో రూ.49.50 లక్షలపై 2025 ఫిబ్రవరి 7 నుంచి అప్పగించే వరకు ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలంది.
ఎస్‌‌‌‌ఎంఎం ఆదిత్య హోమ్స్ డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టకపోవడంతో రూ.27.16 లక్షలు వడ్డీతో సహా వాపసు చేయాలని, మియాపూర్‌‌‌‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టు విషయంలో ఫ్లాట్ నంబర్ 502ను కొనుగోలుదారుకు అప్పగించాలని ఆదేశించింది. బకాయిలున్నాయని సంస్థ చేసిన వాదనను ఆధారాలు లేవని తోసిపుచ్చింది.
జీవీఆర్ ఇన్‌‌‌‌ఫ్రా డెవలపర్స్‌‌‌‌పై ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం, చెక్కులు బౌన్స్ అవడంపై చర్యలు తీసుకుని రూ.7 లక్షలు వడ్డీతో వాపసు చేయాలని, భువంతేజ్ ఇన్‌‌‌‌ఫ్రా ప్రాజెక్ట్స్ అడ్వాన్స్‌‌‌‌లు వసూలు చేసి నిర్మాణం నిలిపివేయడంతో రూ.26 లక్షలు వడ్డీతో సహా కొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది.
ఆదేశాలను పాటించని సంస్థలపై రెరా చట్టం 2016లోని సెక్షన్ 63 కింద అదనపు జరిమానాలు విధిస్తామని అథారిటీ హెచ్చరించింది.